అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
ఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి 'ముఖ్యమైన ప్రతికూల కారకం' (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపి వేసింది.